Saturday, February 20, 2016

వీరాస్ "గణిత శతకము"



గణిత్వం.

కవితా గణితం. 12 (గణిత్వం)

మూడు కోణములను మూడు భుజములను
కలిగిన బహు భుజియె కదర త్రిభుజి
కోణములను గొలువ కొలతల మొత్తము
నూట ఎనబ యుండు నూరు బాల్లు
1
సహజ సంఖ్య లన్న సాగు నొకటినుండి
అంత మవని సమితి అందు రదియు
పూర్ణ సంఖ్య లన్న పూర్ణము తో సాగు
అపరిమితము దాని ఆన వాళ్ళు
2
సంత సమ్ము తెలియ సంఖ్యలలో గూడ
కల్పితాలు గలవు కనుము నీవు
రూటు మైనసొకటి రూటది సపరేటు
కల్పితమ్ము అదియు కఠిన నిజము
3
వ్యాసమందు సగము వ్యాసార్థ మందురు
జ్యాల లోన పెద్ద జ్యాయె నదియు
లెక్క కంద జ్యాలు లెక్కలేనన్నుండు
ఎన్ని గలవొ చెప్ప ఎఱుక లేదు
4
బీజ గణిత మనగ బిగువైన లెక్కల
బిగిని సడల జేయు బీజ మాయె
అంకగణిత మునకు అందాల నద్దులే
మరువకు గుడిపల్లి మాట నెపుడు
5
నాల్గు మూలలైన నాల్గు లంబములేను
కర్ణముల కొలతలు కదర సమము
అట్టి కొలత లలర అదియె చతురస్రము
గణితమె గుడిపల్లి గౌరవంబు
6
ఒక్క జత భుజము లొక్క దూరము నున్న
పిలవ ట్రెపిజియమ్ము పిలుచు కొమ్ము
గణిత మందమైన గణనల శాస్త్రమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
7
నాల్గు మూల లేమొ నాల్గు లంబము లేల
కొలవ భుజము లొక్క కొలత లైన
సమ చతుర్భుజమ్ము సాగ కర్ణమొకటి
గణితమె గుడిపల్లి గౌరవంబు
8
రెండు రెండ్లు నాల్గు ,రెండు మూడుల ఆరు
మూడు రెండ్లు ఆరె ముచ్చటగను
వరుస మార్చ విలువ వాసి మారదెపుడు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
9
గీయ త్రిభుజి మూడు గీతలే అనుకోకు
మూడు కొలత లున్న ముచ్చ టౌను
ఒక్క గట్టి కొలత ఒడుపు చదరమిచ్చు
గణితమె గుడిపల్లి గౌరవంబు
10
పైథాగరస్ సిద్దాంతము

కర్ణ వర్గ మన్న కర్ణేతరమ్ముల
వర్గ ములను గూడ వచ్చు నదియు
లంబ కోణ త్రిభుజ లంబ సూత్రమ్మది
మరువకు గుడిపల్లి మాట నెపుడు
11
(సరూప త్రిభుజ వైశాల్యం)

రూప మేక మైన భుజవర్గ ములెపుడు
ప్రాంత ములను వర్గ ప్రాంత ములను
పోల్చ నొక్క తీరు పోలు త్రి భుజమందు
గణితమె గుడిపల్లి గౌరవంబు
12
కొట్ట బడదు ఎపుడు కోరి దేనితొగాని
ఒకటి కాక నదియు ఒదిగి యుండి
కారణాంక మైన కదర ప్రధానమ
మరువకు గుడిపల్లి మాట నెపుడు
13
కారణాంక ములును కాద రెండే
రెండు
ఎక్కువైన లేక ఏమి తగ్గ
కా దభేద్య సంఖ్య ఖచ్చిత ముగనది
గణితమె గుడిపల్లి గౌరవంబు
14
ఏడు హార మవ్వ ఏల నిర్వదిరెండు
వేయ "పై" విలువగు వృత్త మందు
నిజము,ఖచ్చితమ్ము నిశ్చయమ్ము గకాదు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
15
అంద మైన దన్న ఔను వృత్తమె కదా
కదల కుండ కేంద్ర గాన లహరి
ఒక్క దూర ముననె ఉరికించు చుండు
గణితమె గుడిపల్లి గౌరవంబు
16
తొమ్మి దెక్క ములను తొలిగనే నేర్చినా
పదవ ఎక్క మెపుడు పనియె గాదు
మించు ఎక్క ములవి ముంచు నీ తృష్ణను
మరువకు గుడిపల్లి మాట నెపుడు
17
సరి సరి సరి యైన సరియె ఔనుకాద
బేసి బేసి కూడ బేసి రాదు
సరిని,బేసి కల్వ సరియు రా దేమిరా
గణితమె గుడిపల్లి  గౌరవంబు
18
Whole square of (a+b)
"ఏ"ను "బీ"ను కూడి ఎపుడు వర్గము చేయ
రెంటి మొత్త మంత రెండు సార్లు
విథిగ కలుప వలెను విడివర్గ ములకేను
మరువకు గుడిపల్లి మాట నెపుడు
19
Whole square of ( a-b)

ఏ"లొ "బీ"ను తీసి ఎపుడు వర్గము చేయ
రెంటి మొత్త మంత రెండు సార్లు
విథిగ తీయ వలెను విడివర్గ ములనుండి
గణితమె గుడిపల్లి గౌరవంబు
20
భిన్న భావమంటె భీతిల్ల వలదోయి
పంచు కొనుటె కాద పండు గల్లె
లవము హారమన్న లాభించు మొత్తమ్ము
మరువకు గుడిపల్లి
21
లవము లవము గల్పిలెక్కజే యవలెను
హార మొక్క టైన యపుడు,లేక
పోతె ,హార ములను పోల్చుకసాగుతో
గణితమె గుడిపల్లి గౌరవంబు
22
అకరణీయ సంఖ్య
లవము హార మెపుడు లభిత పూ ర్ణములయ్యు
శూన్య హర మసలె చూడ కున్న
అకరణీయ సంఖ్య యగునని అందురు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
23
సమితి యన్న గుంపు సదవగలదులెమ్ము
చెప్ప గలిగి నపుడు మూల కములు
నిర్వ చించ లేని నింద నీపైవద్దు
గణితమె గుడిపల్లి గౌరవంబు
24
మూలకములు లేని ముచ్చ టే దైనుంటె
శూన్య సమితి యనుము సూటి గాను
ఫై"ని గుర్తు గాను ఫైసలా చేయుము
మరువకు గుడిపల్లి మాట నెపుడు
25
సమితి మూలకములు సంస్తుతి చేసిన
పరిమి తమ్ము అదియు ప్రస్తు తమ్ము
అపరి మిత సమితులు అనబడు లేనిచో
గణితమె గుడిపల్లి గౌరవంబు
26
సమితు లందు నీవు సామ్యమ్ము కనిపెట్టి
నిజము చూప నదియె నిర్మాణ రూపమ్ము
జాబితాగ రాయ జాబితా రూపమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
27
బిందు రేఖ తలము బింక మింకేలన్న
నిర్వచించలేని నిజము కదర
గణితమందు నవియు గణుతి కెక్క గలిగె
గణితమె గుడిపల్లి గౌరవంబు
28
భుజమును పొడిగించ భూమితో కోణమ్ము
బాహ్య మయ్యు వెలుగు బాగ సమము
అంతరాభి ముఖపు అంతర కోణాలు
గణితమె గుడిపల్లి గౌరవంబు
29
పాదములును నాల్గు పాటియై వెలుగొందు
అడ్డు నిలువు రేఖ లమరగాను
అక్ష లేఖ లెపుడు అమరు లంబములయ్యి
గణితమె గుడిపల్లి గౌరవంబు
30
రూపమేకమయ్యి రూపించు నప్పుడు
వేరు గ పరి మాణ  వెతల చూడ
పలక గను సరూప పటము లేను
31
కోణములును మూడు కొలవ సమము గుండ
మూడు భుజములును మురిసి పోవ
త్రిభుజము సమబాహు త్రిభుజమై చెలగురా
గణితమె గుడిపల్లి గౌరవంబు
32
బహుపది పరిమాణ భావన చూడగా
ఘాత మొకటి రెండు ఘనము గుండ
బహుగ రేఖ వర్గ బహుపదు లనియండ్రు
గణితమె గుడిపల్లి గౌరవంబు
33
సైను టీట యైన సైనేతరమ్మైన
కాసు ట్యాను వాటి వ్యుత్క్రమాల
అలరె ట్రిగన మెట్రి అంతయు నవియుగా
గణితమె గుడిపల్లి గౌరవంబు
34
సూత్ర మన్ననేమి సూటిగా మాటాడు
గణిత భాగ మన్న ఘనత యౌను
ఎంత వేగ మైన ఎంచిచూ డగనిచ్చు
గణితమె గుడిపల్లి గౌరవంబు
35
షరతు లున్న వన్ని శంకలేకను గన్న
మనకు లాభమేమి మరవ వద్దు
గణిత దారి తప్పి గణన చేయగ లేము
గణితమె గుడిపల్లి గౌరవంబు
36
ఏక వృత్త మందు ఏ జ్యాల నైననూ
ఒక్క పొడవు గల్గి ఒనర యున్న
కోణ మేక మౌను కేంద్రము తోడను
గణితమె గుడిపల్లి గౌరవంబు
37
నాల్గు బిందు వులను నయముగ కలిపిన
వృత్త మొక్క టైన,వృద్ది యగును
చక్రమొంటి పైన చక్రీయ బహుభుజి
గణితమె గుడిపల్లి గౌరవంబు
38
వాన రాక డెపుడు వాన పోక డెపుడు
తెలియ రెవ్వ రన్న తెలివినుండి
సంభవించు లెక్క సంభావ్య తే జెప్పు
గణితమె గుడిపల్లి గౌరవంబు
39
మార్చి స్థితి జూడ మారని ఫలితమ్ము
ప్రక్రియేది తనకు ప్రశ్న కాదు
కుదురు ధర్మ మాయె కూడస్థిత్యంతరం
గణితమె గుడిపల్లి గౌరవంబు
40
గుణన గుణిజ మన్న గుణకార భావనలు
గుణిజ లబ్ద మన్న గుణక ఫలము
వరుస మార్చ వచ్చు వకటె ఫలము
గణితమె గుడిపల్లి గౌరవంబు
41
చిన్న సంఖ్య యన్న చిత్రమే చిత్రము
ఒక్క టొకటి పెట్టు ఒకటి పక్క
ఒనర గొచ్చు నీకు ఒప్పగా చినసంఖ్య
గణితమె గుడిపల్లి గౌరవంబు
42
దూరమాన మన్న దూరాలు కొలవగా
మలచు కొన్న కొలత మనకు నేడు
పోల్చ దేని నైన పోలిక కొలతయే
గణితమె గుడిపల్లి గౌరవంబు
43
సున్న రెండు నాల్గు సూడ నారెనిమిది
అమరియుండ చూడ నదియు గూడ
పిలువ సరి సంఖ్య మిగులు బేసి యగును
గణితమె గుడిపల్లి గౌరవంబు
44
సరి బేసి లబ్ద సంఖ్య యన్నదెపుడు
సరియె యగును వేరు సరియు గాదు
బేసి బేసి గూడ బేసి సంఖ్యేగదా
గణితమె గుడిపల్లి గౌరవంబు
45
ఒకటి గాదు భేద్య ఒకటి కాదు అభేద్య
సంఖ్య యన్న నిజము సంత సించు
మిగిలి నట్టి ప్రతిది మిగులునేదోదాంట్లొ
గణితమె గుడిపల్లి గౌరవంబు
46
తత్సమాంశమన్న తనలొ కలుపు కొన్న
మార్పు నొంద కుండ మాది రగును
కలుప తీయ మార్పు కనదది సున్నతొ
గణితమె గుడిపల్లి గౌరవంబు
47
తత్సమాంశమన్న తనరు సున్న మరియు
ఒకటి గూడ నట్లె ఒప్పు గాను
మొదట కూడ పిదప మోదమై గుణియించ
గణితమె గుడిపల్లి గౌరవంబు
48
అన్ని అంకె లచట అన్య మెరుగకకల్పి
కొట్ట గలిగి నపుడు కోరి మూడు
కారణాంక మయ్యి కలిసిపోవును గదా
గణితమె గుడిపల్లి గౌరవంబు
49
చివర సున్న ఉన్న చివర నైదున్ననూ
చూడ సులభ మవ్వు చూడగాను
చెప్ప వచ్చు నైదు కార ణమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
50
మూడు రెండు లున్ను ముచ్చటై భాగించ
ఆరు కారణాంక మలర గాను
మూడు రెండు గూడ ముందుగ భాగించు
గణితమె గుడిపల్లి గౌరవంబు
51
కడకు సున్న యున్న కారణంగాపది
లెక్క తప్ప దెపుడు లెస్స గాను
ఐదు రెండు గూడ ఐచ్చిక గుణకాలె
గణితమె గుడిపల్లి గౌరవంబు
52
సరి బేసి స్థాన సంకలన భేదమ్ము
పదున కొండు చేత పంచ బడిన
పదున కొండు దాని పడిపడి భాగించు
గణితమె గుడిపల్లి గౌరవంబు
53
రేఖీయ ద్వయ స్వీకృతం

రేఖ పైన బిందు రేఖతో జేసిన
కోణములను కూడ కొత్త గుండు
కొలవ నదియు నపుడు కోటికి పెట్టింపు
గణితమె గుడిపల్లి గౌరవంబు
54
సంకలించి నపుడు సంకలన ధర్మము
వ్యవ కలన మందు వ్యక్త మైన
వ్యవహ రించ బడును వ్యవకల్న ధర్మమై
గణితమె గుడిపల్లి గౌరవంబు
55
సంఖ్య చివరి రెంటి సంఖ్యను నాల్గది
నాల్గు భాగములుగ నదియు జేయ
కాద నాల్గు దాని కారణాంకము జూడ
గణితమె గుడిపల్లి గౌరవంబు
56
సంఖ్య చివరి మూడి సంఖ్యను ఎనిమిది
సక్కగ విడగొట్టి సవర జేయ
ఎనిమి దప్పుడచట నెరుగ భాగించు
గణితమె గుడిపల్లి గౌరవంబు
57
అంక మూల మింక అంతయు తొమ్మిది
భాగములవ నచట బాగు గాను
కాద తొమ్మి దింక కారణాం కము దెల్వ
గణితమె గుడిపల్లి గౌరవంబు
58
వెసగ పొడవు నెత్తు వెడల్పుల లబ్దంబు
ఘనఫలమ్ము యగును ఘనము గాను
దీర్ఘ ఘనము కొలత ధీరత చూడరా
గణితమె గుడిపల్లి గౌరవంబు
59
భూ పరిథిని ఎత్తు భూరిగ గుణియించ
పట్టకముల నెపుడు పరగ జూడ
వేగ ప్రక్క తలము వైశాల్య మొచ్చులే
గణితమె గుడిపల్లి గౌరవంబు
60
ఎట్టి పట్ట కమ్ము ఎత్తువైశాల్యమ్ము
లబ్ద మెంచ దాని ఘన ఫలమ్ము
అట్లు పరిగ ణించి ఆచరించ వలెను
గణితమె గుడిపల్లి గౌరవంబు
61
ప్రక్క తలము నకును ప్రక్క భూముల కల్ప
పూర్ణ తలము లెక్క పూర్తి యవగ
పూర్ణ తలము యొక్క పూర్తి వైశాల్యమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
62
సౌష్ఠ వాక్షరములు సౌష్ఠ వాక్షములతొ
పదియు పైన రెండు పరగ గలవు
అట్టి ఆంగ్ల భాష అక్షరములనుజెప్పు
గణితమె గుడిపల్లి గౌరవంబు
63
సౌష్ఠవాక్షములను సౌజన్య శీలివై
లెక్క బెట్టి చూడు లెక్క తేల్చు
పరగ చదరమునకు పట్టఎన్నున్నవి
గణితమె గుడిపల్లి గౌరవంబు
64
ఎట్ల మల్చి చూడ ఎన్నగ సమమౌను
వృత్త మెట్లు నాడు వృద్ది యయ్యె
సక్క బెట్ట వృత్త సౌష్ఠవాక్షములెన్ని
గణితమె గుడిపల్లి గౌరవంబు
65
భూమి యొకటి యైన భూమిఘాతములను
కూడి ఘాత ములను కూర్చ గాను
మార్పు లేని భూమి మనకు ఫలితమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
66
రాశి బంధ మేయ రాశుల లెక్కించి
అంత స్సూత్ర మేదొ అందజేయ
సాధనలను మనకు సాధించు దారియౌ
గణితమె గుడిపల్లి గౌరవంబు
67
అసలు వడ్డి కాల లబ్దంబు కనుగొని
వంద భాగ మెంతొ వంతు వేయ
బారు వడ్డి గణన బాగుగా జేయొచ్చు
గణితమె గుడిపల్లి గౌరవంబు
68
వర్గ సంఖ్య యేమి వరుస బేసిలరాసి
పరగ తీయ వచ్చు ఫలిత మెంత
చివర మిగులు సున్న చిత్రమేమిటిచూడు
గణితమె గుడిపల్లి గౌరవంబు
69
మూడు నాల్గు ఐదు ముచ్చట గానీవు
ఎన్ని రెట్లు వేయ ఎక్కు వేమి
పరగ త్రికము లున్ను పైథాగరస్ పేర
గణితమె గుడిపల్లి గౌరవంబు
70
ఘనమూల మనగ ఘనపు సంఖ్య నెపుడు
భేద్య మవని గుణక భేద్య మెంచి
మూటనొక్క టొచ్చు ముడిసిన లబ్దంబు
గణితమె గుడిపల్లి గౌరవంబు
71
ఏక వ్యాస మున్న ఏ శంఖు స్థూపము
గోళమున్ను ఎత్తు గూడ సమమె
ఘనము లొకటి మూడు, ఘనమగు నాలుగు
గణితమె గుడిపల్లి ఘనత యగును
72
ఒకటి రెండు పాల్లు ఒనరగ విభజించు
నట్లు బిందువున్న నయముగాను
త్రిగుణముల దెలుప త్రిథాకరణమదియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
73
మొదటి వాని సగము మొదటనె రాయాలి
మిగిలి నట్టి వాని మిగుల గలిపి
సగము జేసి రాయ సరిమధ్య బిందువౌ
గణితమె గుడిపల్లి ఘనత యగును
74
వై ల భేద మెంతొ వైనముగాజూసి
ఎక్సు భేద మెంతొ ఎన్న జూసి
వాటి భాగ హార వాడియె వాలౌను
గణితమె గుడిపల్లి ఘనత యగును
75
(థేల్స్ సిద్దాంతం)
భుజ సమాంత రమ్ము భుజముల నెప్పుడు
మిగులు భుజము లనది మిక్కు టముగ
విభజ నేక రీతి విభజించు త్రిభుజిలో
గణితమె గుడిపల్లి ఘనత యగును
76
గోడ కేసి నట్టి గోడునిచ్చెన జూడ
లంబ త్రిభుజి నందు లావు గాను
కర్ణ మన్న రీతి కానిపించును గదా
గణితమె గుడిపల్లి ఘనత యగును
77
ఆకరమ్ము నొకటి అరయగా పరిమాణ
యేక మవక నున్న యేమి ఫలము
సర్వ సమము కాదు సారూప్య మౌగాని
గణితమె గుడిపల్లి ఘనత యగును
78
సమితి మూలకములు సరిగ రాయగ నీవు
జాబి తాల నెపుడు జాడ చూడ
ఏది గూడ తిరిగి ఎపుడు రాయగవద్దు
గణితమె గుడిపల్లి ఘనత యగును
79
సున్న సున్న నేల సూటిగా భాగించ
చూడలేము ఎపుడు చూడబోము
అర్ధమవని దికద అట్టి విషయ మేను
గణితమె గుడిపల్లి ఘనత యగును
80
సున్న తోడ సంఖ్య సూటిగ గుణియించ
సున్న లబ్ద మన్న సుందరమ్ము
గణన గుణక ములలొ గణితమె గదనోయి
గణితమె గుడిపల్లి ఘనత యగును
81
శూన్య మైన నేమి శూన్యేతర మవనీ
లబ్ద మెపుడు నీకు లభ్య మవగ
సున్న తోడ జేయ సున్నాయె వచ్చురా
గణితమె గుడిపల్లి ఘనత యగును
82
గుణక మింక నీకు గుణిజము కాబోదు
కారణాంక మదియు ఖచ్చితముగ
ఎన్ని రెట్లొ తెల్పు ఎక్కమే యౌగాని
గణితమె గుడిపల్లి ఘనత యగును
83
సంఖ్య లన్ని సర్ది సరదాగ రేఖపై
చూప నగును మనకు జూడ తగును
కుడి ఎడమల దిశలు కూడ జూపు నవియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
84
కలప వచ్చి నట్టి కొలత తొంబది యైన
అవియు నెపుడు గూడ నరయ సరిగ
పూర కములు కోణ పూరకములవియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
85
వేద గణితమన్న వేగముగా లెక్క
చేయ గలుగు నట్టి చేవ నిచ్చు
స్వామి చూపి నట్టి స్వాగత గణితము
గణితమె గుడిపల్లి ఘనత యగును
86
చిట్టి పొట్టి గాను చిత్రమై కన్పించు
సాధనలను స్వామి సాధ్య పరచె
వేదగణిత మనిన వేదాంత మనికాదు
గణితమె గుడిపల్లి ఘనత యగును
87
వేదగణిత మన్న వేదాలలోనున్న
గణిత సారమదియు ఘనము గాను
భారతావని కిల భాగ్యమై వెలుగొందు
గణితమె గుడిపల్లి ఘనత యగును
88
వర్గ ఘన మూల వాదనలను తాను
మూల ప్రక్రియలంటు ముదము తోడ
మొదలు నేర్వ మనకు మోదము చేకూర్చు
గణితమె గుడిపల్లి ఘనత యగును
89
సృష్టి లోన నేది సృష్టించ బడలేదు
నాశనమ్ము కాదు నాదరూప
గణిత శాస్త్ర మిచ్చు ఘనమైన సత్యమ్ము
గణితమె గుడిపల్లి ఘనత యగును
90
భూమి లెక్క లరయ భూజనుల్ మదిలోన
వేసి నట్టి లెక్క వేగిరమ్ము
రేఖ లెన్నొ వేయ  రేఖాగణితమాయె
గణితమె గుడిపల్లి ఘనత యగును
91
సూక్ష్మ పద్దతులను సూచించె వేదాలు
గణిత సరళి  నిలుప గగనమందు
భవ్య మైన దృష్టి భారతీ తీర్థది
గణితమె గుడిపల్లి ఘనత యగును
92
చక్ర భ్రమణ మునట చక్కగా పరికించి
చేసిరి సమ భాగ ఛేదనమ్ము
నాల్గు లంబము లని నాకువు సూత్రమ్ము
గణితమె గుడిపల్లి ఘనత యగును
నాకువు=పుట్టుట
93
కాలము పని యన్న కాల దూరము లన్న
కలత చెంద వలదు ఘనత బొంద
నిజమది అనుపాత నిష్పత్తి భావనే
గణితమె గుడిపల్లి ఘనత యగును
94
ఒకటి రెండు మూడు ఒనరగ నాలుగు
ఇటుల వేస్తు వరుస ఇరువ దేయ
ఇరువ దిరువ దొకటి ఇంటు జేయ సగము
గణితమె గుడిపల్లి ఘనత యగును
95
నాల్గు పాదములని నయముగ విభజించ
తలము పైన గీత తలపులేగ
జరప మారు పాద జగము వింతేమిటో
గణితమె గుడిపల్లి ఘనత యగును
96
త్రిభుజ శీర్ష ములను త్రికరణ శుద్దిగా
కేంద్ర భాస మన్న కేవ లమ్ము
ఎక్సు వైల కొలత  ఎంతయో సరిజేయ
గణితమె గుడిపల్లి ఘనత యగును

97
సరి ప్రధాన సంఖ్య సరసము గారెండు
ఉన్న దొక్క టేను ఉన్న నిజము
మూడు తోడ సాగు మిగిలిన వన్నియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
98
వంద లోపు గలవు వంక బెట్టగ లేము
ఇరువ దైదు అన్న ఇట్టి నిజము
ముందు సంఖ్య వంద ముందు మూడడుగుల్లొ
గణితమె గుడిపల్లి ఘనత యగును
99
పూర్ణ సంఖ్య నెపుడు పూర్ణ సంఖ్య తొ గూడ
పూర్ణ సంఖ్య వచ్చు పూర్ణ మవగ
సంవృ తమ్ము ధర్మ సంకటమేలేదు
గణితమె గుడిపల్లి ఘనత యగును
100
వినుము గుర్తు మార్చ విలోమ మౌగదా
అకరణీయ సంఖ్య అక్కజముగ
పరగ సంక లనము పరిణితి లిడగాను
గణితమె గుడిపల్లి ఘనత యగును
101
ఒకటి మొదలు గున్న ఒప్పారు సహజాల
మొత్త మెంత యన్న ,చివరి సంఖ్య
దాని ఉత్త రముల లబ్ద సగమగులే
గణితమె గుడిపల్లి ఘనత యగును
102
బహుముఖి ఫలకముల బహువస్తు వులు ఏవి
ఘనము దీర్ఘ ఘనము ఘనము గాను
పట్టకమ్ము మరియు పాటిగా పిరమిడే
గణితమె గుడిపల్లి ఘనత యగును
103
వలగ రూప మేయ వలసిన రూపమ్ము
పేర్చ వచ్చు లెమ్ము పేర్మి మీర
ఊహ గొప్ప గున్న ఊతమిచ్చునుగాద
గణితమె గుడిపల్లి ఘనత యగును
104
జ్యామితీయ పటము జ్యాని లేకుండగా
సరళ సంవృ తమ్ము సకల మవగ
మూడు భాగ ములుగ ముడచగ వీలగు
గణితమె గుడిపల్లి ఘనత యగును
105
చాపము కొస లెంత చాకచక్యమ్ముగా
అర్ధ వ్యాస ములచె అలరి నపుడు
త్రిపుర వృత్త మందు త్రిజ్యాంత రమ్మురా
గణితమె గుడిపల్లి ఘనత యగును
106
సౌష్ఠ వాక్ష మన్న సౌష్ఠవ పటముకు
అడ్డు గీత గాద నక్క జముగ
ఒక్క తీరు భాగ మొప్పారు ప్రతిరూపు
గణితమె గుడిపల్లి ఘనత యగును
107
సాంఖ్య శాస్త్ర గరిమ సాధన తోసరి
భాగ హార మొచ్చు భాగ్య మున్న
పద్ద తన్న దేమి పరిశీలనే చాలు
గణితమె గుడిపల్లి ఘనత యగును
108
విడిగ పొడవు గొల్వ వీభాగి నీ స్కేలు
వృత్త లేఖిని నున్న వృత్త మొచ్చు
కోణమాని యున్న కోణములనుగొల్తు
గణితమె గుడిపల్లి ఘనత యగును
109
వృత్త గోళ మన్న చదర ఘనము లన్న
చక్క నైన జతలు చదువ గాను
దీ.చ.దీ.ఘ లున్ను దీని బోలు నవియె
గణితమె గుడిపల్లి ఘనత యగును
110
సుందరమ్ము గణిత సుస్వరాలాపన
గణిత టీచరన్న గాద కీర్తి
గణిత మెరిగి నోడె ఘనుడుగా వెలుగొందు
గణితమె గుడిపల్లి ఘనత యగును
111


No comments:

Post a Comment